రాజకీయాలు అన్నాక సొంత పార్టీలోనే అంసతృప్తులు..విమర్శలు..ఆరోపణలు ఇవన్నీ సాధారణ విషయాలే. అయితే కాంగ్రెస్ లో ఈ రగడ మరింత ఎక్కువైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ బాద్యతలను స్వీకరించిన నాటి నుంచి సీనియర్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. కాగా తెలంగాణ కాంగ్రెస్ యువనేత చల్లా వంశీచంద్‌రెడ్డికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు ఈ ఉత్వర్వలుపై సంతకం చేసిన సోనియా గాంధీ.. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.అయితే వంశీచంద్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు ఆనందపడుతున్నారట. ఎందుకంటే వంశీచంద్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అనుకూల వర్గం నేత కాకపోవడమే ఇందుకు కారణం. ఇకపై రేవంత్.. తెలంగాణలోని పార్టీ సీనియర్లను సంప్రదించకుండా సంస్థాగత విషయాలపై తీసుకునే నిర్ణయాలు వంశీచంద్ రెడ్డి ద్వారానే సాగించాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు.
అయితే అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై రేవంత్ రెడ్డి దూకుడుకి కొంత కళ్ళెం వేయచ్చని అభిప్రాయపడుతున్నారు సీనియర్ నేతలు. రేవంత్ తీసుకునే నిర్ణయాలతో పాటుగా, రాష్ట్రంలోని పరిస్థితులపై ఏఐసీసీ కార్యాలయానికి సమాచారం చేరడానికి వంశీ సాయపడతాడని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వ్యవహారాలపై పర్యవేక్షణ కోసమే ఏఐసీసీ ఈ నియామకం చేపట్టిందా.. అనే చర్చ కూడా సాగుతుంది. ఏది ఏమైనా వంశీచంద్ రెడ్డి వల్ల తమకి కొంత ఊరట కలుగుతుందని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.