Tuesday, November 26, 2024

Delhi | హస్తినలో తెలంగాణ బీజేపీ కీలక భేటీ.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలోని భారత మండపంలో కీలక సమావేశం జరిగింది. ఇదే వేదికపై రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు విడిగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగా, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చేసేందుకు సమయాత్తమవుతోంది. మజ్లిస్ పార్టీకి కంచుకోటలా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సైతం చేజిక్కించుకునే వ్యూహాలతో కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిటీలో ముఖ్యనేతలు తొలి దశలో అభ్యర్థులను వడపోసి ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం మూడు పేర్లను జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ఆ జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించడానికంటే ముందే తొలి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తొలి జాబితాలో తెలంగాణ నుంచి కనీసం 15 పేర్లు ఉంటాయని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. తద్వారా అభ్యర్థుల ప్రచారానికి వీలైనంత ఎక్కువ సమయం లభిస్తుందని అంచనా వేస్తోంది.

బీజేపీ నేషలన్ కౌన్సిల్ సమావేశాల అనంతరం వివిధ అనుబంధ సంఘాలతో సమావేశాలు జరిగాయి. ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, మైనారిటీ మోర్చా, యువ మోర్చా, కిసాన్ మోర్చా వంటి అనుబంధ విభాగాల సమావేశాల అనంతరం జాతీయ పదాధికారులతో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలు, వివిధ రాష్ట్రాల్లో పొత్తులు, ఎన్డీఏ కూటమి బలోపేతం ఆవశ్యకత గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు లేవని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement