మంకీపాక్స్ వైరస్‌పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కానప్పటికీ, వైరస్ పట్ల అశ్రద్ధ చేయవద్దని కేంద్రం ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇండియాలో కనిపించే చికెన్ పాక్స్‌ను పోలినట్లు ఉండే మంకీపాక్స్ జంతువుల ద్వారా మనుషులకు సోకే వైరస్. ఈ వ్యాధి నిర్థారణ, చికిత్స పట్ల అవగాహనతో పాటు బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.మంకీపాక్స్ అనుమానం ఉన్న కేసులను తక్షణం గుర్తించి, ఆ వివరాలను రాష్ట్ర, కేంద్ర పర్యవేక్షణ యూనిట్లకు అందించాలని కేంద్రం సూచించింది.
వైరస్ లక్షణాలు, వ్యాధి నిర్థారణ నిబంధనలకు అనుగుణంగా ఈ యూనిట్లు కేంద్ర ఆరోగ్యశాఖకు నివేదికను అందచేస్తాయని ప్రకటించింది. మంకీపాక్స్ నిబంధనల ప్రకారం వ్యాధి నిర్థారణ చేసిన తర్వాత బాదితులను 21 రోజుల పర్యవేక్షించడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఐసీఎంఆర్, ఎన్ఐవి, ఎయిమ్స్ వంటి సంస్థలకు చెందిన డాక్టర్లు, వ్యాధి నిపుణులతో సమావేశం నిర్వహించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..