హైదరాబాద్,ఆంధ్రప్రభ : పోడు భూముల సమస్యలపై లోతైన అధ్యయనం చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర సచివాలయంలో అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం పోడు భూముల సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… పోడు భూముల సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు భూముల వివరాలను మంత్రి సురేఖ అధికారులను ఆరా తీయగా ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్ (ఐఎఫ్‌ఆర్) కింద 6,51,822 దరఖాస్తులు రాగా 2,30,735 మంది పట్టాదారులకు 6,69,676 ఎకరాల పోడు భూమి పంపిణీ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
కమ్యూనిటి ఫారెస్ట్ రైట్స్ (సీఎఫ్‌ఆర్) కింద 3,427 దరఖాస్తులు రాగా, 721 దరఖాస్తుదారులకు పట్టాలు అందించగా, పలు కారణాలతో 1,024 దరఖాస్తులను పెండింగ్ లో పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోడు భూముల పై హక్కుల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదుకావాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయంలో తిరస్కరణకు కారణాలను వివరించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
సమీక్షా సమావేశానికి హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఆర్మూల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనుల పోడు భూముల హక్కులు, అడవుల ఆక్రమణ, అటవీ భూముల గుండా రవాణాకు సంబంధించి సమస్యలను మంత్రి కొండా సురేఖతో ప్రస్తావించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అడవులు, గిరిజనుల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటిడిఎల పిఓలు, డిఎఫ్‌ఓలు సామరస్యపూర్వకంగా, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.