ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకునేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణలో పీసీసీలో మార్పులు చేసిన తరువాత దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఏపీలో అందుకు విరుద్ధంగా ఉండటంతో పార్టీలో తిరిగి నూతనోత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీలోని కీలక నేతంతా ఇతర పార్టీలోకి వలస వెళ్లడంతో పార్టీ కుదేలైంది. ఇప్పుడు పార్టీని తిరిగి బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే ఏపీ పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో త్వరలోనే తెలిపోతుంది.