అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)పై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్టోబర్ 1, 2022 నుంచి ఆదాయ పన్ను చెల్లింపు దారులు ఈ పథకానికి అనర్హులని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా ఇప్పడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయ పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త ఉత్తర్వు ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆగస్టు 10న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆదాయ పన్ను చెల్లింపుదారుగా ఉన్న ఏ పౌరుడైనా ఆదాయ పన్ను చట్టం ప్రకారం అనర్హులు. దీని ప్రకారం 2022 అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హులు కాదు.
కొత్త నిబంధన ప్రకారం, ఎవరైనా అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ఈ పథకంలో చేరి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తేదీ లేదా అంతకు ముందు ఆదాయ పన్ను చెల్లింపుదారుగా గుర్తించబడితే అతని లేదా ఆమె ఖాతా వెంటనే మూసివేయబడుతుంది. ఇంకా అప్పటి వరకు డిపాజిట్ చేసిన పెన్షన్ మొత్తం తిరిగి చెల్లించబడుతుంది. అక్టోబర్ 1, 2022న లేదా ఆ తర్వాత చేరిన సబ్స్క్రైబర్, దరఖాస్తు చేసిన తేదీ లేదా అంతకు ముందు ఆదాయ పన్ను చెల్లింపుదారుగా ఉన్నట్లు కనుగొనబడితే ఏపీవై ఖాతా మూసివేయబడుతుంది. ఇంకా అక్కడి వరకు సేకరించిన పెన్షన్ మొత్తం చందాదారులకు ఇవ్వబడుతుంది” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
అటల్ పెన్షన్ యోజన ఎలా పొందాలంటే…
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హత గల అసంఘటిత రంగంలో పనిచేసే పౌరులు ఈ పథకంలో చేరొచ్చు. నెలకు రూ.100 నుంచి చందా కట్టొచ్చు. ఈ చందాకు బ్యాంకు సేవింగ్స్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి. చందాదారులు వయసు 60ఏళ్లు నిండిన తర్వాత వారు కట్టిన మొత్తాన్ని బట్టి రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను హామీ ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 99లక్షల మందికి పైగా ఈ స్కీంలో చేరారు. 2022 మార్చి నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 4.01 కోట్ల మంది చందాదారులుగా ఉన్నారు. అయితే కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక ఆదాయ పన్ను చెల్లింపుదారులు 1 అక్టోబర్ 2022 నుంచి ఈ పథకంలో పాల్గొనలేరు అలాగే పెట్టుబడి పెట్లలేరు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.