కర్నాటకకు చెందిన ప్రభుత్వ రంగంలోని సహకార సంఘం పాల బ్రాండ్ నందిని కేరళలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. నందిని కేరళలో అవుట్‌లెట్స్‌ను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నందిని ప్రయత్నాలకు అడ్డుకోవాలని కేరళ ప్రభుత్వం నేషనల్ డైయిరీ డెవలప్‌మెంట్ బోర్డును కోరింది. నేషనల్ డైయిరీ డెవలప్‌మెంట్ బోర్డు జోక్యం చేసుకున్నందున కేరళలో కార్యకలాపాలు ప్రారంభించాలన్న ప్రయత్నాలను విరమించుకున్నట్లు నందిని సీఈఓ తమకు తెలిపినట్లు కేరళ పాడిపరిశ్రమ శాఖ మంత్రి చించురాణి తెలిపారు. కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మిల్మా బ్రాండ్ పేరుతో పాలను విక్రయిస్తోంది.
కర్నాటక కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నందిని బ్రాండ్‌తో పాలను విక్రయిస్తోంది. మిల్మా, నందిని రెండు సహకార సంఘం నిబంధనల కిందనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందువల్ల తమ ప్రాంతంలోకి నందిని అనుమతించలేమని కర్నాటక కు స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. కర్నాటకలో గుజరాత్ సహకార సంఘానికి చెందిన అముల్ రాకను కర్నాటక వ్యతిరేకించినట్లుగానే తాము కూడా నందినిని వ్యతిరేకిస్తున్నామని కేరళ మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కర్నాటకు చెందిన నందిని అవుట్‌లెట్స్‌ను కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారని, ఇది ఎంత మాత్రం సరైంది కాదని మంత్రి చెప్పారు. ఇది అనైతిక చర్యని విమర్శంచారు.