Friday, November 22, 2024

Kerala – జ‌న‌ప‌క్షం పార్టీ బిజెపిలో విలీనం ….

ఢిల్లీ – లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కేరళ జనపక్షం (సెక్యులర్‌) చీఫ్‌, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ తన పార్టీని భాజపాలో విలీనం చేశారు. తన కుమారుడు షాన్‌ జార్జ్‌, ఇతర నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం కమలదళంలో చేరారు. కేరళ భాజపా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్‌, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు.

పీసీ జార్జ్‌ సారథ్యంలోని కేరళ జనపక్షం (సెక్యులర్‌) పార్టీ భాజపాలో విలీనమైందని భాజపా జాతీయ కార్యదర్శి అనిల్‌ ఆంటోనీ వెల్లడించారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతపై విశ్వాసంతోనే ఆయన తమ పార్టీతో కలిశారన్నారు. జనపక్షం విలీనం కేరళలో చారిత్రాత్మక పథానికి నాంది కానుందని.. ఇక్కడ భాజపా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీ జార్జ్‌ గతంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో కేరళ కాంగ్రెస్‌లో పనిచేసిన జార్జ్‌.. 2019లో కేరళ జనపక్షం (సెక్యులర్‌) పార్టీని స్థాపించారు. అంతకుముందు కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గానూ పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement