Friday, November 22, 2024

ఆన్‌లైన్‌ ఆటో సర్వీస్ ప్రారంభించిన‌ కేరళ ప్రభుత్వం.. ఆగ‌స్టు నుంచి అందుబాటులోకి..

కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ఆటో సర్వీస్‌ను ప్రారంభించింది. తొలిదశలో తిరువునంతపురంలో దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ రోజు (గురువారం) కార్మిక శాఖ మంత్రి వి.శివరన్‌కుట్టి తెలిపారు. తొలి దశలో 500 ఆటోలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్‌ ఆటో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రయివేట్‌ సర్వీసులకు ధీటుగా ఈ ఆన్‌లైన్‌ ఆటో సర్వీసులు ఉంటాయని మంత్రి వివరించారు. ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆటోలకు సాంకేతిక సహాయం అందిస్తుంది. ఈ సర్వీసులకు మోటార్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు పర్యవేక్షిస్తుంది. గురువారం నాడు ఈ సర్వీస్‌లకు సంబంధించిన లోగోను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రయివేట్‌ ట్యాక్సీ, ఆటో సర్వీసులపై పలు ఫిర్యాదులు ఉన్నాయని, అధిక రేట్లు వసూలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఆన్‌లైన్‌ ఆటో సేవలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా, అత్యంత సురక్షితంగా సర్వీసులు నడుపుతామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఆటోలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయన్నారు. క్రమంగా ట్యాక్సీ, ఆటో స్టాండ్లు కనుమరుగు అవుతున్నాయని, ప్రజలు తాము ఉన్నచోటు నుంచే వీటి సేవలు పొందాటానికి ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి వివరించారు. అందువల్లే వారు ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ట్యాక్సీలను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు.

అధిక ఛార్జీలు..

ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్న ప్రయివేట్‌ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. క్యాబ్‌కు 20 నుంచి 30 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కార్మిక శాఖ ఆన్‌లైన్‌ ఆటో సర్వీసుల ఆలోచన చేసిందని కార్మిక శాఖ మంత్రి వివరించారు. ప్రభుత్వం కేరళ సవ్వారీ పేరుతో ఈ ఆటో సర్వీస్‌లను నడపనుంది. ఇందులో చేసే వారి నుంచి 8 శాతం మాత్రమే సర్వీస్‌ ఛార్జీ వసూలు చేస్తామని మంత్రి వివరించారు. ప్రస్తుతం ప్రయివేట్‌ యాప్‌ ద్వారా సేవలు అందిస్తున్న సంస్థలు ఆటో డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కేరళ సవ్వారీ సర్వీస్‌లు పీక్‌ డిమాండ్‌ పేరుతో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వీసుల ద్వారా తాము అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణీలకు కూడా లద్ది చేకూరేలా చూస్తున్నామని చెప్పారు.

బుకింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే…

ఆన్‌లైన్‌లో ఆటో బుక్‌ చేసుకున్న తరువాత డ్రైవర్లు, ప్రయాణీకులు వాటిని క్యాన్సిల్‌ చేసుకునే అవకాశం ఉంది. యాప్‌లో ఈ సదుపాయం ఉంటుందని, అయితే అందుకు తగిన కారణం చూపించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. సరైన కారణం లేకుండా డ్రైవర్లు బుకింగ్‌ను కాన్సిల్‌ చేస్తే కొంత మొత్తం అపరాధ రుసుంగా వసూలు చేస్తామన్నారు. కేరళ సవ్వారీ సర్వీస్‌లో ఆటో నడిపేందుకు ఎలాంటి కేసులు లేని డ్రైవర్లను మాత్రమే అనుమతిస్తారు. ఇందు కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆటో జీపీఎస్‌ కలిగి ఉంటుంది. ఏదైన ఇబ్బంది, ప్రమాదం జరిగినప్పడు యాప్‌లో ప్యానిక్‌ బటన్‌ ఉంటుంది. దీన్ని ఆటో డ్రైవర్లు, ప్రయాణీకులు కూడా ఉపయోగించుకోవచ్చు. రెండో దశలో డ్రైవర్లకు, ప్రమాణీకులకు ప్రమాద బీమాతో పాటు ఇన్సూరెన్స్‌ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. ఈ ఆటోలకు విమానశ్రయాలు, బస్టాండ్‌ల్లో ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కేరళ టూరిజం పెంపుదలకు ఈ సర్వీసులు ఎంతో దోహదపడతాయని భావిస్తున్నట్లు మంత్రి వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement