ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలకు మందులు, పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని కేజ్రీవాల్ ఆదేశించారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మంగళవారం తెలిపారు.
మొహల్లా క్లినిక్‌లలో అందుబాటులో ఉన్న లేబొరేటరీ పరీక్షల్లోని సమస్యల గురించి కేజ్రీవాల్‌కు తెలియజేశామని, అందుకే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు భరద్వాజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ సమస్యల పరిష్కారానికి వైద్యారోగ్యశాఖ వెంటనే కృషి చేస్తుందని తెలిపారు.
కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల సంక్షేమం గురించే కేజ్రీవాల్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని కేజ్రీవాల్ తాజా ఉత్తర్వులే నిదర్శనమని భరద్వాజ్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ నెల 28 వరకు ఇడి కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని గత వారం జలవనరుల శాఖ మంత్రి అతిషికి ఆదేశాలు జారీ చేశారు.