ఢిల్లీ కొత్త సీఎంగా కేజ్రీవాల్ అతిషిని ఎంపిక చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తారని, మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు చేపడతారని అతిషి అన్నారు.
ఇతర పార్టీల్లో ఉంటే కనీసం టిక్కెట్ కూడా వచ్చేది కాదని అన్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం తనకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారన్నారు. ఆ తర్వాత మంత్రిని చేసి.. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా చేశారని అతిశి పేర్కొన్నారు. తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినందుకు కేజ్రీవాల్‌కి అతిషి కృతజ్ఞతలు తెలిపారు. తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు.
తనపై నమ్మకం ఉంచిన కేజ్రీవాల్‌కు అతిషి ధన్యవాదాలు చెప్పారు. ఈ అవకాశం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించడం పార్టీ గొప్పదనమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని అతిషి చెప్పారు.
తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని అభినందించవద్దని, పూలమాలలు అవసరం లేదని సూచించారు అతిషి. ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి మాట్లాడిన అతిషి.. మద్యం పాలసీ కేసులో తప్పుడు ఆరోపణలతో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వంతో పాటు, దర్యాఫ్తు సంస్థలకు చెంపపెట్టు అన్నారు. కేజ్రీవాల్ స్థానంలో మరొకరు ఉంటే సీఎం పదవిని వదులుకునే వారు కాదనీ అతిషి చెప్పారు.