మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా.. ఇదే సమయంలో తాజాగా సీఎం మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ”కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు” అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.