ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ గురువారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు.. నేడు ఆయనను కోర్టు లో హాజరు పరచనున్నారు. విచారణ కోసం ఈ డి కస్టడీ కోరనుంది.
కాగా, ఈడీకి చెందిన అధికారుల బృందం నిన్న సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని.. ఆయనను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. కాగా, భారీ భద్రత మధ్య ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్‌ను తీసుకెళ్లారు. ఈడీ సమన్లకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది.
అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్‌తో సహా ఇండియా కూటమిలోని పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అర్దరాత్రి విచారణ చేయాలంటూ కోరారు. కానీ, ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌పై అత్యవసర విచారణకు సుప్రీం కోర్టులో ఆప్ నేతలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు.. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ ను ఉంచుకుంది.