హైదరాబాద్, ఆంధ్రప్రభ : వివాహితపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదరింపు కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నాగేశ్వరరావును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అయిదు రోజుల కస్టడీకి ఇస్తూ హయత్‌నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనస్థలిపురం పోలీసులు చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగేశ్వరరావును విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అత్యాచారం, హత్యాయత్నం జరిగిన ప్రదేశంతో పాటు కారు ప్రమాదానికి గురైన స్థలం తదితర వాటన్నింటినీ పోలీసులు రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నాగేశ్వరరావు తర్వాత ఆమె భర్తను కూడా తన సర్వీస్ రివాల్వర్‌తో బెదరించి కారులో తీసుకు వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో పలు కీలక కేసులను దర్యాప్తు జరిపిన నాగేశ్వరరావు అనేక సందర్భాలలో వార్తలలో నిలిచారు. అయితే ఆయన నేరం చేసి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళిన తర్వాత అనేక మంది బాధితులు నాగేశ్వరరావు తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. కస్టడీ విచారణలో పోలీసులు గతంలో దర్యాప్తు చేసిన కొన్ని కేసులకు సంబంధించిన వివరాలను కూడా సేకరించే అవకాశాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.