కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చాడని, నల్లగొండను మోసం చేసిన ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు పనికిరాని జగదీశ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ జిల్లాను నాశనం చేశాడని ఆరోపించారు.
ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే బీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్ రావుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి, రూ.లక్షల కోట్లు దోచుకున్నారని గత కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 6 వేల పాఠశాలలను మూసివేసిందని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.