హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: బీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయి పార్టీగా మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఆయన జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ఆహ్వానించారు. అంతేకాదు కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోరాడతామని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఏడాదే కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీఆర్‌ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ- చేయాలనేది నెమ్మదిగా నిర్ణయించుకున్నా జాతీయ పార్టీగా మారేందుకు గల అవకాశాలన్నింటినీ కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో అనేక రాష్ట్రాల్ల్రో ఆయా అధికార పార్టీల అధినేతలతో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కర్ణాటక తరహాలోనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీఆర్‌ఎస్ తరపున అభ్యర్ధులను ప్రకటించవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
తెలుగువారు ఉన్నచోట పోటీ
2024లో లోక్‌సభ ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే వివిధ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ తరపున అభ్యర్ధులను ప్రకటించవచ్చు. వివిధ రాష్ట్రాల సీఎంలతో, పార్టీల అధినేతలతో ఉన్న సంబంధాలను బట్టి తెలుగువారి ఓట్లను రాబట్టు-కునేందుకు బీఆర్‌ఎస్ తరపున అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని పరిశీలకులు చెబుతున్నారు. వంద లోక్‌సభ స్థానాల్లో పోటీ-చేసేలా మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాగే గుజరాత్ సూరత్‌లో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. గుజరాత్ నేతలతో కేసీఆర్ ఇప్పటికే టచ్‌లోకి వచ్చేశారు. ఒడిశాలోనూ అనేక చోట్ల తెలుగువారి ప్రభావం ఎక్కువే. రాజధాని ఢిల్లో లోనూ తెలుగువారి ప్రభావం చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. తెలుగువారి ఉనికి ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఉనికి ఎక్కడ ఉన్నా ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో బీఆర్‌ఎస్ పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది.