న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యాన్ని సేకరించి, మిల్లుల్లో బియ్యంగా మార్చి, ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ వాటాను మిగుల్చుకుని మిగతా మొత్తాన్ని సెంట్రల్ పూల్ కింద కేంద్ర ప్రభుత్వానికి (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అందజేయాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల నుంచి సేకరించకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కారణంగా రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను కలిసి తెలంగాణలో రైస్ మిల్లర్ల ఇబ్బందులను వివరించానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తాము గొడవ చేసిన తర్వాత జూన్ నెలలో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసిందని బండి సంజయ్ అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పంపిణీ చేయకపోవడం వల్ల నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైస్ మిల్లుల నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వమే బియ్యం సేకరణ చేపట్టాలని తాను కేంద్ర మంత్రిని, అధికారులను కోరినట్టు బండి సంజయ్ తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. రైస్ మిల్లర్ల సమస్యకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని, మిల్లర్లను ఆయన మోసం చేశారని దుయ్యబట్టారు. అవసరమైతే రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులను ఢిల్లీకి తీసుకొచ్చి కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.