పేద, మధ్యతరగతి ప్రజలు ఏ అవసరాలైతే ఎదుర్కొంటున్నారో, వారి అవసరాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలుచేస్తున్న సీఎం కేసిఆర్ పేద ప్రజల దేవుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 29, 36, 42, 43 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఇప్పటివరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 3వేలకు పైగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ప్రజాక్షేమం కోసం ఏ నాయకుడు చేయలేని విధంగా సీఎం కేసిఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని ఎమ్మెల్యే చందర్ ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం, పదవుల కోసం ఏనాడు వెంపర్లాడటం తనకు తెలియదని, తనకు తెలిసిందల్లా ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్, కార్పొరేటర్‌లు బాల రాజ్ కుమార్, కొమ్ము వేణు, నాయకులు తోడేటి శంకర్ గౌడ్, నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్, జిట్టవేని ప్రశాంత్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.