ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తదని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల పాలన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఒక్క పార్టీయే రాష్ట్రం అంతటా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 90కి పైగా స్థానాలు వస్తాయని తమ సర్వే చెబుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు..
షెడ్యూల్ ప్రకారమే 2023లో ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం చెప్పారు. కానీ బీజేపీ నుంచి స్పందన లేదన్నారు కేటీఆర్. అన్ని వ్యవస్థలతో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలో ఉందని ఆయన ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఎవరికీ బెదరడు.. లొంగడు..
కేసీఆర్ ఎవరికీ బెదరడు.. లొంగడు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ మోదీ, ఈడీ అని ఎద్దెవా చేశారు. మంచి పనులతో మనసులు గెలవడం బీజేపీకి తెలియదు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. సిరిసిల్లకు రాహుల్ వస్తే స్వాగతిస్తాం.. వచ్చి నేర్చుకోమనండి అని కేటీఆర్ సూచించారు.
ధరణి సమస్యలు పరిష్కరిస్తాం..
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని గుర్తు చేశారు. రైతులపై కేంద్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు.