న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగానే సీఎం కేసీఆర్ బూటకపు వాగ్దానాలను చేస్తూ తనదైన శైలిలో మరోసారి తెలంగాణ సెంటిమెంటును ప్రజల్లో రేకెత్తించాలని చూస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖల మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దంటూ హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తానన్న వ్యక్తికి ఇప్పుడు ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మెట్రో ఫేజ్1లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఓల్డ్‌సిటీ మీదుగా 5.2 కి. మీటర్ల పొడవున నిర్మించనున్న మెట్రో లైన్ పనులు ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదో స్పష్టం చేయాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభించకుండా ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులకు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవడం చూస్తుంటే తమ అనధికారిక మిత్రులు ఓవైసీలకు మేలు చేకూరుస్తున్నట్టు అర్థమవుతోందని ఆరోపించారు.
మెట్రో ఫేజ్1 నిర్మాణంలో భాగంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ క్రింద దాదాపు రూ.1,500 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్ల నిధులను విడుదల చేసిందని వెల్లడించారు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభిస్తే మిగతా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో రైలు మార్గం ఉన్న అన్ని ప్రాంతాలకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించాలనే ప్రతిపాదనలతో 2012-2013లో రూ. 816.55 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్2 ప్రాజెక్టును మంజూరు చేశామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ ఫేజ్2 ప్రాజెక్టుకు తన వంతుగా అందించవలసిన నిధుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తోందని విమర్శించారు. 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు గడువు 2022తో ముగుస్తున్నా పూర్తి చేయలేకపోవడానికి పూర్తి కారణం కేసీఆరేనని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,169.23 కోట్లకు పెరిగిందన్న ఆయన, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 779.41 కోట్లను చెల్లించవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ. 279 కోట్లను మాత్రమే చెల్లించిందని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇంకా రూ.500.41 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.
పెరిగిన అంచనా వ్యయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 389.82 కోట్లను చెల్లించవలసి ఉండగా, అంతకుమించి రూ. 163.18 కోట్లను అదనంగా మొత్తం రూ. 553 కోట్లను ఖర్చు చేసినట్టు వివరించారు. దీనిపై కేసీఆర్ ప్రభుత్వానికి నాలుగు సార్లు లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. ఎనిమిదిన్నర సంవత్సరాలలో రూ. 800 కోట్ల ప్రాజెక్టును పూర్తి చేయటానికి సహకరించని కేసీఆర్ ప్రభుత్వం, రూ. 6,250 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టును మూడేళ్లలో ఏ విధంగా పూర్తి చేయగలదో హైదరాబాద్ ప్రజలకు గ్రహించాలన్నారు. మెట్రో ఫేజ్2 ప్రాజెక్టుకు కేసీఆర్ విడుదల చేసిన నిధులను చూస్తుంటే ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయటానికి కనీసం 65 సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ వదిలి అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టి అన్ని కోట్లిస్తాం, ఇన్ని కోట్లిస్తామంటూ ప్రచారం చేయడం ముందస్తు ఎన్నికల్లో భాగమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.