Tuesday, November 26, 2024

కేసీఆర్ వైఫల్యంతోనే ఉత్తర తెలంగాణ నీటమునక : రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వైఫల్యంతోనే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు నీట మునిగాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ రాజకీయాంశాలపై సమీక్షలు జరుపుతున్నారు తప్ప వరద సహాయకచర్యలపై జరపడం లేదని ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఇప్పటికీ సరైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టలేదని నిందించారు. రాష్ట్రంలో మొత్తం 20 అసెంబ్లీ నియజక వర్గాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయిందని, మరో రెండు మూడేళ్లు నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనంగా నిలిచిందని దుయ్యబట్టారు. తక్షణమే నిద్రమత్తు వీడి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 17 నుంచి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ సహాయక బృందాలు పర్యటించి వరద బాధితులకు సహాయం అందజేస్తాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో తాను స్వయంగా పర్యటిస్తానని తెలిపారు. 10-12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వెంటనే పంట నష్టం, ఆర్ధిక నష్టంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయాలని సూచించారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తెలంగాణలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు కేంద్రం సహాయం అందించాలని కోరారు. మోదీ-షాలు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నిండా నీట మునిగి అన్నమో రామచంద్ర అంటున్నారని, తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు సహా నష్టపోయినవారందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వంపై ఉందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement