Thursday, November 21, 2024

Followup : కేసీఆర్ మరో ప్రస్థానం.. ఢిల్లీ, చండీగఢ్ నగరాల్లో పర్యటన..

  • రాజకీయ నేతలు, ఆర్థిక రంగ నిపుణులు, మీడియా ప్రతినిధులతో భేటీ
  • కిసాన్ – జవాన్ కేంద్రంగా రాజకీయ వ్యూహాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశం కోసం, దేశ ప్రగతి కోసం సరికొత్త ఎజెండాను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ పదే పదే వ్యాఖ్యానించే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే. చంద్రశేఖర రావు మరో ప్రస్థానం మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకున్న ఆయన, ఢిల్లీతో పాటు చండీగఢ్ నగరాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలేనని, ఆ రెండు పార్టీలకు జాతీయస్థాయిలో దూరదృష్టి లేదని ఆరోపించే కేసీఆర్, ప్రత్యామ్నాయ అజెండా రూపొందించేందుకు నడుం బిగించారు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు సమస్యలపై తొలుత దృష్టి సారించారు. మోదీ సర్కారు మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేయగల్గిన రైతు ఉద్యమాన్ని ఆయన తన వ్యూహంలో భాగంగా చేసుకున్నారు. ఆ ఉద్యమ సమయంలో అసువులుబాసిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తూ, జాతీయ స్థాయిలో తన స్వరాన్ని బలంగా వినిపించేందుకు కసరత్తు చేస్తున్నారు.

కేసీఆర్ శనివారం రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. అలాగే దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే ప్రముఖ జాతీయ మీడియా సంస్థల పాత్రికేయులను కూడా సీఎం కలిసి చర్చలు జరపనున్నారు. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ చండీగఢ్ బయల్దేరి వెళ్తారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. అలాగే ఒక్కో కుటుంబానికి గతంలో ప్రకటించిన విధంగా రూ. 3 లక్షల చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా హాజరవుతారు.

బెంగళూర్ నుంచి బెంగాల్, బిహార్

ఈ నెల మే 26న కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం కేసీఆర్ షిరిడీ వెళ్తారు. మే 29 లేదా 30న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సిఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement