Thursday, November 21, 2024

చిన జీయర్ కు కేసీఆర్ షాక్ : ఇరువురి మధ్య మరింత పెరిగిన దూరం !

త్రిదండి చినజీయర్‌ స్వామికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి షాకిచ్చారు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం సీఎం దూరంగా ఉన్నారు. కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి రప్పించేందుకు చినజీయర్‌ స్వామితో పాటు మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
మరోవైపు ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ఈ వాయిదా సీఎం కేసీఆర్‌ కోసమేనంటూ ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఫ్రధాని నరేంద్రమోదీ పర్యటన.. సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి మధ్య చిచ్చురేపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని పర్యటనతోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముచ్చింతల్‌ పర్యటనకు కూడా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్‌.. ముగింపు వేడుకలకు సైతం రాకపోవడాన్ని బట్టి చినజీయర్‌పై ఆయన ఇంకా ఆగ్రహంతోనే ఉన్నట్లు అర్థమవుతోంది.
శిలాఫలకంలో పేరు లేకపోవడంతోనే మొదలు..
శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్‌ పేరు లేకపోవడంతోనే ఇది మొదలైంది. సీఎం పేరు లేని విషయంపై సమాచారం అధికార వర్గాల ద్వారా సీఎంవోకు ముందుగానే అందింది. అంతేకాదు.. కొందరు చినజీయర్‌ ఆశ్రమంలోని వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం మంచిదనే సంకేతాలను సీఎంకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారు. అప్పటినుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీని చినజీయర్‌ స్వామి గొప్పగా కొనియాడారు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఆయనను శ్రీరామచంద్రునితో పోల్చారు. ఈ విగ్రహావిష్కరణకు మోదీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. అసలే కాకమీద ఉన్న కేసీఆర్‌కు ఈ పొగడ్తలు మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో సీఎం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చినజీయర్‌ స్వామి అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రయత్నించారు.
దివ్య క్షేత్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన చొరవ కారణంగానే ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయని కొనియాడుతూ వచ్చారు. అయినప్పటికీ.. ఆదివారం సువర్ణమూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎం.. ఆయన వెంట ముచ్చింతల్‌కు మాత్రం రాలేదు. దీంతో సీఎంకు చినజీయర్‌ స్వామికి మధ్య ఎడబాటు మరింత పెరిగిందనే విషయం వెల్లడైంది.

శిలాఫలకంపై పేరు పెట్టినా..
సీఎం కేసీఆర్‌ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సువర్ణమూర్తి ఆవిష్కరణ శిలాఫలకంపై ఆయన పేరును కూడా పెట్టారు. దీంతో సీఎం కాస్త చల్లబడి ముగింపు ఉత్సవాలకు హాజరవుతారని భావించారు. ముందు మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం దంపతులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. కానీ, ఈ కార్యక్రమం ముగిసేవరకూ కేసీఆర్‌ రాలేదు. అయితే సాయంత్రం 5.30 గంటలకు దివ్యక్షేత్రానికి కేసీఆర్‌ వచ్చి శాంతి కల్యాణంలో పాల్గొంటారని అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ కార్యక్రమానికి కూడా సీఎం హాజరు కాలేదు. ఇలా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం రాకపై సస్పెన్స్‌ కొనసాగింది. సీఎంను ఈ కార్యక్రమానికి రప్పించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. సీఎం హాజరు కాకపోవడంతో నిర్వాహకులు నిరాశ చెందారు. కొద్దిసేపటి తరువాత శాంతి కల్యాణాన్ని ఈనెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రుత్వికులను సన్మానించే కార్యక్రమం ఆలస్యమవుతున్నందున శాంతి కల్యాణాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే సీఎం కోసమే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రచారం సాగుతోంది. సీఎంను ఇక్కడకు రప్పించేందుకు చివరి ఆశతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

19న చారిత్రక సన్నివేశం- చినజీయర్‌ స్వామి
శ్రీరామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో కొలువైన 108 దివ్యదేశాల్లోని దేవతామూర్తులకు ఈనెల 19న నిర్వహించే శాంతి కల్యాణం మొదటి చారిత్రక సన్నివేశమవుతుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. సోమవారం సాయంత్రం శాంతి కల్యాణం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రుత్వికులకు సన్మానం చేసేందుకు సమయం సరిపోవడం లేదని, అందుకే 19న జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు.
ఏ కార్యక్రమం చేపట్టినా కృత్రిమం లేకుండా శ్రద్ధ, నిష్ఠతో చేస్తే పలితం ఉంటుందన్నారు. యాగశాలల నిర్మాణంలో సంప్రదాయ వస్తువులను వినియోగించినట్లు చెప్పారు. హోమకుండాల నిర్మాణంలో శాస్తోక్తంగా సంప్రదాయం ప్రకారం ఆవుపేడ, మట్టి, ఇటుకలు, తాటి ఆకులు వినియోగించినట్లు వివరించారు. స్తంభానికి కట్టిన వస్ర్తాలు సైతం నారతో తయారు చేసినవేనన్నారు. అన్ని ఆలయాల్లో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement