హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం అద్భుత ఫలితాలనిస్తోంది. భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషకాహార, ఇమ్మ్యూనైజేషన్ లోపాలను అధిగమించేందుకు కేసీఆర్ కిట్ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. కేసీఆర్ కిట్‌తో..మహిళలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనవసర సిజెరియన్ ప్రసవాలకు అడ్డుకట్ట పడటంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సానుకూల పరిణామాలతో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో ఆరోగ్య సూచికల్లో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. దంపతులకు ఇద్దరు పిల్లల వరకు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన మగ శిశువుకు రూ.12,000/, ఆడశిశువు పుడితే రూ 13,000/ నగదును ఆర్ధిక సహాయంగా నాలుగు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది. మహిళలు గర్భం దాల్చినప్పటినుంచి ప్రసవానంతనరం కూడా తల్లి బిడ్డకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు, ఇమ్మ్యూనైజెషన్ వాక్సినేషన్లను కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తోంది.
కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ 2 న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచటంతోపాటు ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న గర్భిణీకి అవసరమైన టీకాలను, విటమిన్లను ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేసీఆర్ కిట్ పథకం కింద 2017 నుండి ఇప్పటి వరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1176 కోట్ల 54 లక్షలను ఖర్చు చేసింది. అదేవిధంగా రూ.243 కోట్ల 68 లక్షలను వెచ్చించి 11,82,014 కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతి కిట్‌లో శిశువు ఆరోగ్య సంరక్షణకు అవసరమైన 15 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తోంది.