Friday, November 22, 2024

కేసీఆర్ వల్లే నేడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం వల్లే నేడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందింది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం దోరేపల్లి ఫంక్షన్ హాల్ నందు జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2 టౌన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లిపాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల ఆదేశాల మేరకు బీఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. BRS పార్టీ ద్వారా నేడు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన కేసీఆర్ కి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేశారు. BRS పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరైనా నాతో పాటుగా కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. పార్టీ పట్ల విధేయత, నాయకుని మాట జవదాటకుండా పూర్తి విశ్వాసంగా ఉండడం, ఎన్నుకున్న ప్రజలకు,నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేయాలి అని సూచించారు.
మీ ప్రేమ, అభిమానం వల్లే నేడు నేను ఇక్కడ ఉన్నానని, మీ అజయ్ అన్న ఎమ్మెల్యేగా చేసుకోవాలి అని మీరు అనుకున్నారు కాబట్టే నేను గెలిచాను.. గెలిచాను కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంత్రిగా పని చేయగలిగే అవకాశం కల్పించారు అని అన్నారు. ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. నగరంలో వేల మందికి ఆసరా పెన్షన్ లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మీ, షాదిముభరక్ పథకాలను ద్విచక్ర వాహనంపై ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాం.. ఇలా మన ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలు ప్రతి గడపకు అందిస్తున్నామన్నారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. మన పార్టీ మూడవ సారి హ్యాట్రిక్ కొట్టాలని, అందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తేనే చాలు అని అన్నారు.
త్వరలో ఎన్నికలు రానున్నాయని కొత్త కొత్త పగటి వేషగాళ్లు ఇళ్లకు వస్తుంటారని, వారి మాటలు నమ్మొద్దని, బీజేపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలను బిఆర్ఎస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులకు భోజనాలు వడ్డించి వారితో పాటు కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, సూడా ఛైర్మెన్ విజయ్, AMC చైర్మన్ శ్వేత, BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, RJC కృష్ణ, కార్పొరేటర్లు, పార్టీ వివిధ విభాగాల డివిజన్ నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement