న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలనపై టీఆర్‌ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. శనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారతీయ రాష్ట్రీయ సమితి పార్టీ ఏర్పాటుపై స్పందించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ పెడతారా అంటూ ఎద్దేవా చేశారు. ముందు కేసీఆర్ బంగారు తెలంగాణ స్వప్నాన్ని పూర్తి చేయాలని తరుణ్ చుగ్ హితవు పలికారు. కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయన్న ఆయన, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. నిందితులు యథేచ్ఛగా ప్రభుత్వ వాహనాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ సహా పలువురు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారన్న తరుణ్ చుగ్, అందరి మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల వారినీ కలుపుకుపోయే వ్యక్తిని ప్రధానమంత్రి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని తరుణ్ చుగ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.