Tuesday, November 19, 2024

TS | రాజన్నకి మోడీ ఒక్క రూపాయి ఇవ్వలే.. : కేసిఆర్

దక్షిణ కాశీగా పేరుందిన రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ అభివృద్ధి కోసం ఒక రూపాయి కూడా ఇస్తామని ప్రకటించలేదని మాజీ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ…. హిందూ ధర్మం అని ప్రగల్బాలు పలికే మోడీ రాజన్న ఆలయానికి ఏమీ ఇవ్వలేదని, ధర్మం కోసం పనిచేస్తామన్న బండి సంజయ్ ఏమీ అడగలేదన్నారు.

చేనేత కార్మికులకు రావాలసిన బకాయిలు చెల్లించాలని ప్రశ్నిస్తే తనపై 48 గంటల నిషేధం విధించారన్నారు. మోడీ మరోసారి ప్రధాని అయితే పెట్రోల్ డీజిల్ ధర 400 రూపాయలవుతుందన్నారు. రైతులను పేదలను అన్ని వర్గాలను మోసగించిన బిజెపి, కాంగ్రెస్ లకు మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. బిజెపికి కేంద్రంలో అధికారం ఇస్తే విదేశాల నుండి నల్ల డబ్బును తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని ప్రగల్బాలు పలికిన మోడీ పదేళ్లు గడిచిన హామీ నిలుపుకోలేదన్నారు.

కాంగ్రెస్కు అధికారం ఇస్తే 15 వేల రూపాయల రైతుబంధు ఇస్తామని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన రైతులకు ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి తప్పారన్నారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని, విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామని, రైతు కూలీలకు 12000 ఇస్తామని, పింఛన్లను 4 వేలకు పెంచుతామని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.

డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి 5 నెలలుగా అమలు చేయడం మరిచి ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరో డ్రామాకు తెరలేపారన్నారు. ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బొంద పెట్టాలన్నారు. బిజెపి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ఏ రోజు రెప్పపాటు కరెంటు పోకుండా తాము ప్రభుత్వం నదిపామని, ఈ ప్రభుత్వానికి కరెంటు ఇవ్వడం చేతకావడం లేదన్నారు.

సాగునీటికి దిక్కేలేదు కనీసం తాగునీరు కూడా అందించని అసమర్థ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ వార ప్రదాయిని గోదావరి జిల్లాలను తీసుకెళ్తామని మోడీ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రం వచ్చాక చేనేత అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలులోకి తెచ్చామన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ గిఫ్టులు, స్కూల్ యూనిఫామ్ లు కార్మికులచే చేయించి వారిని అభివృద్ధి దిశలో పయనించేలా చేసామన్నారు.

- Advertisement -

ఇటీవల రంజాన్ పర్వదినం కోసం ప్రతి ఏడాది ఇచ్చే రంజాన్ తోఫాలు ఈ ప్రభుత్వం అందించలేదన్నారు. రైతులు కష్టించి పండించిన దాన్యం వర్షం నీటికి తడిసిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బండి సంజయ్ కి వినోద్ కు పోలిక ఉందా అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడితే కనీసం ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను గెలిపించాలన్నారు.

సిరిసిల్ల రాజన్న జిల్లాను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారని, జిల్లా రద్దు కాకుండా ఉండాలంటే పార్లమెంటరీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ ను గెలిపిస్తే తాను జిల్లా రద్దు కాకుండా కొట్లాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, చల్మడ లక్ష్మీనరసింహారావు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, గూడూరి ప్రవీణ్, రవీందర్రావు, అరుణ తో పాటు పెద్దసంఖ్యలో ప్రజల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement