Saturday, November 23, 2024

ధర్నాల పేరుతో కేసీఆర్ హైడ్రామా.. ధాన్యం కొనుగోలులో విఫలం: నూనె బాల్​రాజ్​

న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ‌: తెలంగాణ సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అంటూ బిజెపి సెంట్రల్ స్టేట్ కో ఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ విమర్శించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కావాలనే రైతులతో రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును ధర్నాల పేరుతో ఖర్చు చేస్తున్నారు. గంట సేపు కూడా ధర్నా చేయని సీఎంను ఏమనాలో టీఆర్ఎస్ నేతలే చెప్పాలి. ప్రజల మద్ధతు కోల్పోతుండటంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ధర్నా చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కి కూడా అదే పరిస్థితి రాబోతుందని తెలిపారు. రైతులతో రాజకీయం చేసిన పార్టీ గెలిచినట్లు చరిత్రలో లేదన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మకైంది మీ పార్టీ నేతలు కాదా ? మిల్లర్ల మాఫియాతో మీ కుటుంబ సభ్యలకు ఒప్పందాలు చేసుకున్నారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటుంది మీ ప్రభుత్వం కాదా..? దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రైతుల నుంచి ధాన్యం సేకరించి ఎఫ్ సి ఐకి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఏ విషయంపై ఆందోళన చేయాలో తెలియక నూకలతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల విధానల వల్ల రాష్ట్ర రైతాంగం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఈగోలతో ( ఆహం ) అన్నదాతలను ఆగం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నానంటూ వేడుకున్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. కొనుగోలుకు రూ. 2000 కోట్లు కేటాయించలేరా అని మండిపడ్డారు. రైతులను కేంద్ర ప్రభుత్వంపై ఎగదోయాలని చూస్తున్న కేసీఆర్.. ముందుగానే పక్కా ప్లాన్ ప్రకారమే కొనుగోలులో ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలిపారు. రా రైస్ గా వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ కు నిధులు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నది నిజం కాదా అన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మాని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement