హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరు మీద ‘కేసీఆర్ ఫెలోషిప్’ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన కోరారు. యూనివర్శిటీలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. శాసనసభలో శనివారం పద్దులపై జరిగిన చర్చలో భాగంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడారు. మహిళా విద్యాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికిగానూ 15వ ఆర్థిక సంఘం అభినందించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ఆయన కోరారు. బలహీన వర్గాల కోసం గురుకులాలను ఏర్పాటు చేశారని, తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల సంఖ్యను 125 నుంచి 927కు పెంచారన్నారు.
త్వరలో మహిళా యూనివర్శిటీ కూడా అందుబాటులోకి రానుందన్నారు. విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ.36 నుంచి రూ.50కి పెంచారన్నారు. గురుకుల పాఠశాలలను రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో మొదట స్థాపించింది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని, ఆ రెసిడెన్షియల్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను మెరుగుపర్చుతున్నట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం బోధనను చేపట్టబోతున్నట్లు ఆయన వివరించారు. విద్యా సంస్థల భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఆ భూములను విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. తుంగతుర్తి నియోజక వర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..