Friday, November 22, 2024

Delhi: లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబం.. సీబీఐ డైరెక్టర్‌కు కేఏ పాల్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బుధవారం న్యూఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. సీఎం అవినీతిపై విచారణ జరగాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని, కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా, కేసీఆర్ సర్కార్ అధికారం చేపట్టాక నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్దఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారని, తెలంగాణతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్‌ నుంచి లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి, 75 వేల కోట్లు దోచుకున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్న ఆయన, 2 వేల కోట్ల అంచనాలో 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతాదంతా తమ జేబుల్లో వేసుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ ఖజానాకు, ప్రజల సొమ్ముకు న్యాయం చేయాలని సీబీఐని కోరానని పాల్ వెల్లడించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలని, దర్యాప్తునకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలకు కూడా ఫిర్యాదు కాపీలను పంపించానని వివరించారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డి అవినీతిపై కూడా సీబీఐ డైరెక్టర్‌తో మాట్లాడానన్నారు. లక్ష రూపాయలు అవినీతికి పాల్పడ్డారనే బంగారు లక్ష్మణ్‌ని అరెస్టు చేశారని గుర్తు చేసిన కేఏ పాల్, రాష్ట్రంలో వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతుంటే ఎందుకు వారిని అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. వెంకయ్యనాయుణ్ని రాష్ట్రపతిని చేయవద్దని కేంద్రానికి సూచించానని చెప్పుకొచ్చారు. తాను మొదట్నుంచీషెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి చెప్పానని పాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement