Tuesday, November 19, 2024

కె విశ్వనాథ్ కీర్తి అజరామరం – కెసిఆర్

హైదరాబాద్ – ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే విశ్వనాథ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కే విశ్వనాథ్‌ అని కొనియాడారు. గతంలో కే విశ్వనాథ్‌ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం పేర్కొన్నారు.సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా మానవ సబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా, దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కే విశ్వనాథ్‌ అని అన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికితురాయిగా నిలిచాయని పేర్కొన్నారు. కవి పండితులకు జనన, మరణ భయం ఉండదని, వారి కీర్తి అజరామరం అని ‘జయన్తి తే సుకృతినో.. రససిద్ధాః కవీశ్వరాః నాస్తియేషాం యశః కాయే జరామరణజం భయమ్‌’ అనే వాక్కు విశ్వనాథ్‌కు వర్తిస్తుందని తెలిపారు.

కలిసి సినిమా చేద్దాం సర్‌: సీఎం కేసీఆర్‌

తెలుగు చిత్రపరిశ్రమ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌ తెలుగు ప్రజలకు కలకాలం నిలిచిపోయే అపురూప చిత్రాలను అందించారు. ఆయనకు అభిమాని కాని తెలుగు వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. విశ్వనాథ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా వీరాభిమాని. విశ్వనాథ్‌ చిత్రాలన్నింటిని వదిలిపెట్టకుండా చూస్తానని కేసీఆర్‌ అనేక సందర్భాల్లో చెప్పారు. 2019 ఆగస్టు 11న కేసీఆర్‌ స్వయంగా విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లి, ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సాహిత్యంపై ఇరువురు అరగంటపాటు చర్చించారు. ‘నేను మీకు వీరాభిమానిని సర్‌. చిన్నప్పటి నుంచి మీ చిత్రాలన్నింటిని వదిలిపెట్టకుండా చూసేవాడిని. శంకరాభరణం సినిమాను 25 సార్లు చూశాను. ఇప్పటికీ వీలుచిక్కినప్పుడల్లా మీ సినిమాలు చూస్తూనే ఉంటాను.సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలవాలని అనుకొంటాను. ఇంతకాలానికి నా కోరిక తీరింది. మీరు రూపొందించిన ప్రతి సినిమా ఓ మధుర పద్యంలా ఉంటుంది. ఒక తపస్విలా మీరు సినిమాలు తెరకెక్కిస్తారు. మీ సినిమాలోని ప్రతి చిన్న అంశం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కుటుంబం మొత్తం ఒకచోట కూర్చొని చూడగలిగేవి మీ చిత్రాలే. గత పదేండ్లుగా మీరు సినిమాలు తీయటంలేదని తెలిసింది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంటే మీతో ఒక సినిమా రూపొందించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం అంత మంచి సినిమాలు రావటం లేదు. మీరు మళ్లీ ఓ అద్భుత సినిమా చేయాలని కోరుకొంటున్నా’ అని సీఎం కోరారు. కానీ, విశ్వనాథ్‌ అనారోగ్యంగా ఉండటంతో ఆ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement