ప్రజాసమస్యలపై సభలో ప్రస్తావిస్తుంటే అడ్డుకోవడం సరికాదు. సభకు రావొద్దంటే రాం అంటూ సీఎల్పీనేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించగా, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. రావొద్దని మేమెందుకు అంటం అధ్యక్షా.. సభా నియమాల ప్రకారం,సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రతి సభ్యుడూ మాట్లాడాలి. కేటాయించిన టైం సద్వినియోగం చేసుకోవాలి. భట్టికి సీఎం చురకలు వేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో పలుమార్లు సీఎం వర్సెస్ భట్టి సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ప్రతి సందర్భంలోనూ భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్లు ఇస్తూ ఆద్యంతం సభపై పట్టు కొనసాగించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల విషయంలో అసెంబ్లీ లో పరిమితికి మించి మాట్లాడలేం . ఆ విషయం డిప్యూటీ స్పీకర్గా పని చేసిన భట్టి విక్రమార్కకు తెలుసు. మీ పార్టీ ఎంపీలు కూడా లోకసభలో ఉన్నారు. అక్కడ మాట్లాడితే భాగుంటుంది. అయినా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందంతా చెప్పాం అని సీఎం సమాధానమిచ్చారు.
చేసింది పెద్దగా ఉంది కాబట్టే..
సీఎల్పీనేత భట్టి కాంగ్రెస్ పాలనలోనే ఉన్నట్లు భ్రమల్లో ఉన్నారని, గవర్నర్ ప్రసంగం బుక్ పెద్దదిగా ఉందని భట్టి అన్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దదిగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
భట్టిపై అధికారపక్షం భగ్గు
ఆ తర్వాత వ్యవసాయ చట్టాలు, ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై భట్టి విక్రమార్క మాట్లా డుతుండగా.. అధికారపక్షం నుంచి నిరసన ఎదురైంది. శాసన సభాపతి జోక్యం చేసుకని కేటాయించిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నారంటూ భట్టిని వారించడంతో పాటు మైక్ కూడ కట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య రాజోపాల్ రెడ్డి భట్టికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికార, కాంగ్రెస్ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం నెలకొంది. చివరకు స్పీకర్ భట్టికి మాట్లాడే అవకాశం ఇవ్వగా.. సీఎం కేసీఆర్ ఎవరిని కలవకుండా ఉంటున్నారని అనడంతో మళ్లీవివాదం మొదలైంది. వెంటనే మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకుని భట్టి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరగా.. భట్టి చేసిన వ్యాఖ్యలను రికార్డులను నంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తుంటే అడ్డుకోవడం సరికాదని, సభకు రావద్దంటే రామని భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం తీరుకు నిరసగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్చేసి బయటికి వచ్చారు.