Saturday, November 23, 2024

వంశీచంద్ రెడ్డికి కీల‌క బాద్య‌త‌లు..సోనియా..రాహుల్ కి థ్యాంక్స్..

కాంగ్రెస్ పార్టీలో ప‌లు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీస ప‌ద‌విని సీనియ‌ర్ల‌కి కాకుండా రేవంత్ రెడ్డికి అప్ప‌జెప్పిన అధిష్టానం..మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తోన్న వంశీచంద్ రెడ్డిని.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీచంద్ రెడ్డి 2014లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచే అధిష్టానం వద్ద గుర్తింపు పొందిన వంశీచంద్ ని జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయకుడిగా నియమించ‌డం విశేషం.

దాంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీకి… వంశీచంద్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 .. 2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 .. 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012..14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బిజెపి పార్టీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై గెలుపొంది, తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టాడు.

వంశీచంద్ సేవలకు గుర్తింపునిచ్చి 2018 ఆగష్టులో ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో… మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. టిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు.. అయినా కాంగ్రెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయనకి సోనియా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మ‌ధ్య‌కాలంలో కాంగ్రెస్ అధిష్టానం చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. స‌త్తా ఉన్న నాయ‌కుల‌ను ఏరీ కోరీ ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను అప్ప‌గిస్తోంది. కాంగ్రెస్ స‌త్తాని చాటేలా వ్య‌వ‌హ‌రించాల‌ని ప‌లు సూచ‌న‌లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement