Tuesday, November 26, 2024

ఈడీ ముందు కవిత ప్రతినిధి.. రోజంతా ఈడీ కార్యాలయంలో సోమ భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎదుట మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతినిధిగా ప్రముఖ న్యాయవాది సోమ భరత్ కుమార్ హాజరయ్యారు. సుమారు 5 గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. మద్యం పాలసీ కేసులో ఇప్పటికే 3 పర్యాయాలు ఈడీ విచారణ ఎదుర్కొన్న కవిత, తదుపరి కేసులో అవసరాన్ని బట్టి తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్ హాజరవడం కోసం ఆథరైజేషన్ ఇచ్చారు. కేసుకు అవసరమైన పత్రాలు, ఇతర వస్తువులు, రాతపూర్వక సమాచారం అందజేయడం కోసం కవిత ధృవీకరించిన ప్రతినిధిగా సోమ భరత్ వ్యవహరిస్తారు.

గత విచారణ సందర్భంగా కవిత తనతో పాటు 10 సెల్‌ఫోన్లను మీడియాకు ప్రదర్శించి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసుతో సంబంధం ఉన్నవారంతా తమ సెల్‌ఫోన్లను మార్చి, ధ్వంసం చేశారంటూ అటు సీబీఐ, ఇటు ఈడీ తమ చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఇదే అంశంపై భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చారు. ఏ తప్పూ చేయనప్పుడు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందంటూ నిలదీశారు.

- Advertisement -

ఈ క్రమంలో తాను సెల్ ఫోన్లు ధ్వంసం చేయలేదంటూ కవిత ప్రకటించారు. అలాగే వాటిని మీడియాకు చూపించి మరీ ఈడీ కార్యాలయంలో అప్పగించారు. ఆ సెల్‌ఫోన్ల నుంచి డేటాను రికవరీ చేసే ప్రయత్నాలను ఈడీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఫోన్ అన్‌లాక్ ప్యాటర్న్ తెలుసుకోవడం కోసం, అన్‌లాక్ చేయడం కోసం ఈడీ తాజాగా కవితకు మెయిల్ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సెల్‌ఫోన్లు తెరిచేందుకు సంబంధిత అధికారులు, నిపుణులకు సహకరించేందుకు తన ప్రతినిధిగా సోమ భరత్‌ను పంపించినట్టు తెలిసింది. విచారణ అనంతరం సోమ భరత్‌ను మీడియా ప్రశ్నించగా.. ఈడీ కార్యాలయం లోపల జరిగిన అంశాల గురించి తాను మాట్లాడలేనని, మాట్లాడ్డం సమంజసం కూడా కాదని అన్నారు. తదుపరి మళ్లీ నోటీసులు ఏవైనా ఇచ్చారా అని ప్రశ్నించగా, ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement