న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేసులో సాక్షిగా ఉన్న మహిళను సీఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ ) కార్యాలయానికి పిలిపించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించి సమయంలో ఆమె ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అప్పటికే ఈడీ విచారణపై నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెడింగులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కవిత పిటిషన్‌ను పై పిటిషన్ల సమూహంతో కలిపి ట్యాగ్ చేస్తూ సుప్రీంకోర్టు గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆ పిటిషన్లు అన్నీ కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టగా.. కొన్ని అంశాలను విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారం చేపడతామని వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement