Friday, November 15, 2024

TS | కవిత అరెస్టు అప్రజాస్వామికం.. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం : హరీశ్ రావు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, క‌విత అరెస్ట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని అన్నారు. కవిత అరెస్టును సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని తెలిపారు. మహిళల ఈడీ అరెస్టు చేసే విషయంలో సుప్రీంకోర్టు విచారణ జరుగుతోందని అన్నారు. కవితను ఉన్నట్టుండి అత్యవసరంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీశారు.

గత 18 నెలలుగా బీజేపీ నేతలు అరెస్టు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, అందుకే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని చెప్పారు. తమకు అరెస్టులు, వేధింపులు కొత్త కాదని తెలిపారు. మమతా బెనర్జీ, నళిని బెనర్జీ, కవిత కేసులపై సుప్రీంకోర్టు విచారిస్తోందని అన్నారు.

కవిత అరెస్టు కు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాల నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును ప్రజా క్షేత్రంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఆ రెండు పార్టీలకు శిక్ష తప్పదని అన్నారు. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక ఇప్ప‌టికే ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలించారు. రేపు ఢిల్లీలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం కవితను రూస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement