Saturday, November 23, 2024

Delhi | కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు.. జైలు అధికారులపై కవిత ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ట్రయల్ కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న సదుపాయాలను తిహార్ జైలు అధికారులు కల్పించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా తిహార్ జైలులో ఉన్న కవిత గురువారం సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు మాత్రమే ప్రత్యేకించిన కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మెడికల్ రిపోర్టులను ఆధారంగా చేసుకుని స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజ తాను కోరిన సదుపాయాలు కల్పించాల్సిందిగా ఆదేశించినట్టు ఆమె గుర్తుచేశారు. ఇంటి భోజనంతో పాటు పరువు, దుప్పటి, పుస్తకాలు, పెన్ను, పేపరు వంటివి ఏర్పాటు చేయాల్సిందిగా జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశాల్లో స్పష్టంగా ఉన్నాయని అన్నారు. పరుపులు ఏర్పాటు చేయకపోగా, కనీసం చెప్పులు కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెన్ను, పేపర్లు లేవని, కళ్లజోడు కూడా అనుమతించడం లేదని పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. బట్టలు, బెడ్‌షీట్స్, పుస్తకాలు, దుప్పటి వేటినీ అనుమతించలేదని తెలిపారు. చేతికున్న జపమాలను కూడా అనుమతించలేదని అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సదుపాయాలు కల్పించేలా మరోసారి ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరుపుతామని సీబీఐ స్పెషల్ కోర్టు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement