వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మృతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మృతి చెందిందన్న వార్త తనను కలచివేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో నిరుపేద బిడ్డ ప్రాణం తీసిందని, కన్నతల్లికి కడుపుకోత మిగిలిందని కవిత మండిపడ్డారు.
ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలిగొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందని ఆరోపించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలని కవిత ధ్వజమెత్తారు.