న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకాకుండా తన తరపున న్యాయవాది సోమా భరత్ ఈడీ ఆఫీసుకు పంపారు. ఈ నెల 11వతేదిన ఈడి విచారణలో అడిగిన అన్ని డాక్యుమెంట్లను సోమా భరత్ తో ఈడికి అందజేశారు.. అలాగే ఈరోజు విచారణకు స్వయంగా హాజరుకావాలని ఇచ్చిన నోటీసులో లేనందువల్ల తన తరుపు ప్రతినిధిగా భరత్ ను పంపుతున్నట్లు కవిత లేఖలో పేర్కొన్నారు.. ఈ లేఖను,డాక్యుమెంట్స్ ను ఈడికి అందజేసిన అనంతరం సోమా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా కవిత ఫోన్‌ను ఈడీ సీజ్ చేసిందన్నారు. ఈడీ విచారణ అంశంపై సుప్రీంకోర్టు లో పిటీషన్ వేశామని, ఆ తీర్పుకు అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. మహిళను ఇంటి వద్దే విచారించాలని, ఆఫీసుకు రావాలని సమన్లు ఇచ్చే పవర్స్ ఈడీకి లేవన్నారు.
తమ హక్కులు సాధించడానికే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేశామన్నారు. ఇంటికి వచ్చి విచారించాలన్నది మహిళలకు ఉన్న హక్కు అని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ మహిళా నేతను వేధిస్తున్నారని సోమా భరత్ ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరుకాబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. చట్టం ప్రకారం మహిళల్ని ఇంటి వద్దే విచారించాలని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇదో ఫాబ్రికేటెడ్ కేసు అని, రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు ఈ కేసు వేసినట్లు ఆయన ఆరోపించారు. ఈడీపై వేసిన పిటిషన్ గురించి ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారించనున్నట్లు ఆయన చెప్పారు. కచ్చితంగా సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకే విచారించాలన్న నిబంధనను ఈడీ ఉల్లంఘించినట్లు సోమా భరత్ తెలిపారు. ఈ నెల 11 విచారణ రాత్రి 8 .30 గంటల వరకు సాగిన విషయాన్ని ప్రస్తావించారు.. అలాగే కవిత వ్యక్తిగత ఫోన్ ను ఈడి స్వాధీనం చేసుకోవడాన్ని భరత్ తప్పు పట్టారు..