న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా కాదు ‘విష’ నగరంగా మార్చారని మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక మద్యం అమ్మకాలు తెలంగాణలోనే జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పాత్ర ఉందంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా మధు యాష్కీ గుర్తు చేశారు. కవితకు నిజామాబాద్, బెంగళూరు ఆస్తులు, జెన్నారం ఫామ్ హౌజ్ ఎలా వచ్చాయి? ఆదాయానికి మించిన ఆస్తులు ఎలా వచ్చాయి? రాజకీయాల్లోకి రాక ముందు ఉన్న ఆస్తులెన్నో చెప్పాలని మధు యాష్కీ ప్రశ్నించారు.
తెలంగాణ రాక ముందు త్రిబుల్ బెడ్ రూం ఇంట్లో ఉన్న వారికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన నిలదీశారు. లిక్కర్ స్కాంలో కవిత వాటాల సంగతి, సంతోష్ వాటాల సంగతి తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్ఎస్-బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని తేలిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలోనే లిక్కర్ లావాదేవీలు జరిగాయన్న ఆయన, తప్పుడు ఆరోపణలైతే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 2జీ స్కాం విచారణ జరిగిందని, లిక్కర్ కుంభకోణంలో కూడా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు. ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపు కోసం దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అందుకే ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని మధు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదు? విచారణకు ఎందుకు డిమాండ్ చేయడంలేదని ప్రశ్నించారు. విచారణలో ఆలస్యం జరిగితే ఆధారాలను మాయం చేసే అవకాశముంటుందని, ఆధారాలు మాయం చేయడంలో కల్పకుంట్ల కవిత దిట్టని ఆయన ధ్వజమెత్తారు. అందుకే దర్యాప్తు సంస్థలు కోర్టు పర్యవేక్షణలో వెంటనే కవితతో పాటు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. సీబీఐ, ఈడీ విచారణ జరిపితే అన్నీ బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కవితపై ఆరోపణలు చేసిన ఎంపీతో గతంలో కవిత స్నేహంగా ఉండేవారని గుర్తు చేసిన మధు యాష్కీ, అలాంటి నేతే ఆరోపణలు చేశారంటే కచ్చితంగా ఆయనకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయని నొక్కి చెప్పారు.
ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కాంలో దొరకడం సిగ్గుచేటని ఆయన కవితను ఎద్దేవా చేశారు. తెలంగాణ బిడ్డలు మద్యం మత్తులో జోగుతున్నారని, ఎంతో మంది మహిళల జీవితాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో భర్తను, బిడ్డను, తండ్రిని పోగొట్టుకున్న తెలంగాణ ఆడబిడ్డల ఉసురు ఆమెకు తగులుతుందని మధు యాష్కీ జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి వరదలంటూ ఆరోపించిన కేంద్రమంత్రి దానిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.