Monday, November 25, 2024

Delhi | హైకోర్టును ఆశ్రయించిన కవిత.. బెయిల్‌ కోరుతూ పిటిషన్‌

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్‌ కోర్టు (రౌజ్‌ అవెన్యూ కోర్టు) కవిత దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆమె ఇప్పుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కవిత తరఫున న్యాయవాది మోహిత్‌ రావు ఈ పిటిషన్‌ దాఖలు చేయగా, ఢిల్లీ హైకోర్టులో జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఎదుట శుక్రవారం పిటిషన్‌ విచారణ జాబితాలో చేరింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో మార్చి 15న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత తొలుత మధ్యంతర బెయిల్‌ కోరగా, ట్రయల్‌ కోర్టు నిరాకరించింది.

అనంతరం సాధారణ బెయిల్‌ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మరోవైపు ఇదే కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కూడా కవితను అరెస్టు చేయగా, ఆ కేసులోనూ రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. త్వరలో సీబీఐ కేసులోనూ విడిగా బెయిల్‌ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement