ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చుకుందన్నారు. కవితను అరెస్ట్ చేయబోమని గతంలో ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిందని., ఈడీ ఎన్ని సార్లు పిలిచినా.. కవిత విచారణకు హాజరై, కావాల్సిన సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే ఈడీ అధికారులు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆరోపించారు.
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరితే కేసులు రద్దు చేస్తారు.. లేకుంటే వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇలా ఎన్నో రాజకీయ పార్టీలను లొంగదీసుకుని తమ పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. దేశంలో భాజపాను ఎదిరించేది కేసీఆర్ ఒక్కరే అన్నారు. కవిత నిర్దోషిగా బయటపడుతుందని జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.