Monday, November 25, 2024

జంతర్ మంతర్ వద్ద రేపు కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం పోరాటం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తలపెట్టిన దీక్ష నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనుంది. ‘భారత జాగృతి’ నేతృత్వంలో చేపట్టిన ఈ దీక్షకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సహా దేశంలోని మొత్తం 18 రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్ధతు తెలిపాయి. ఆయా పార్టీల నుంచి నేతలు దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. ఈ దీక్షకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కవిత గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ చొరవతో మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో పాసైనప్పటికీ.. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల సహకారం లేక ఆ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందలేకపోయిందని అన్నారు. 2014లో ఆ తర్వాత 2019లో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా బిల్లు గురించి పేర్కొందని, కానీ రెండు ఎన్నికల్లో సొంతంగానే మెజారిటీ సాధించినప్పటికీ బిల్లును గాలికి వదిలేసిందని తెలిపారు.

ఆధార్ బిల్లును మనీ బిల్లుగా చెప్పి మరీ పాస్ చేయించుకున్న ఈ ప్రభుత్వం మహిళా బిల్లును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. భారత్‌లో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని, తానేమీ అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలతో పోల్చి చెప్పడం లేదని, ఇరుగు పొరుగు దేశాలతో పోల్చిచూసినా సరే భారత్‌లోనే తక్కువ ప్రాతినిథ్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని చేస్తే తప్ప ప్రాతినిథ్యం పెరగదని, అందుకే తాను మహిళా బిల్లు కోసం పోరాటం మొదలుపెట్టానని అన్నారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ దీక్ష ప్రారంభం మాత్రమేనని, పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తమ పోరాటాన్ని రోజురోజుకూ ఉధృతం చేస్తామని ఆమె వెల్లడించారు.

- Advertisement -

జంతర్ మంతర్ దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయని, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది దీక్షను ప్రారంభింపజేస్తారని, దీక్ష ముగింపు కార్యక్రమం సీపీఐ కార్యదర్శి డి. రాజా చేతుల మీదుగా జరుగుతుందని తెలిపారు. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారని కవిత వెల్లడించారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళల కోసం చేస్తున్న తన ఈ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్ధతు పలకాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా సోనియా గాంధీని లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకెవరినైనా ఆహ్వానించారా అని మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా.. “మేడం సోనియా గాంధీ చాలా పెద్ద మనిషి. నేను ఒక చిన్న ఎమ్మెల్సీని. కాకపోతే మద్ధతివ్వాలని కాంగ్రెస్‌ను కోరాను. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశాను. వాళ్లు కూడా హాజరవుతారని ఆశిస్తున్నాను” అన్నారు.

టీమ్ లీడర్ కాదు.. టీమ్ ప్లేయర్

దేశంలో బీజేపీని ఎదుర్కోడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో లౌకికత్వం దెబ్బతింటోందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భావసారూప్యత కల్గిన పార్టీలన్నీ కలవాలని ఆమె కోరారు. అయితే కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు కాదని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. దేశంలో ఆ పార్టీకి 600 మందికి మించి ఎమ్మెల్యేలు లేరు. ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంది. ఆ పార్టీ నేతలు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటే మంచిది. టీమ్ ప్లేయర్‌లా అందరితో కలిసి పనిచేయాలి తప్ప టీమ్ లీడర్ అనుకుంటే కుదరని పని” అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని, ఆ పార్టీ బీ-టీమ్ లా వ్యవహరిస్తోందని చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా బలంగా గొంతెత్తేవారిని బీ-టీమ్ అనడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ బీ-టీమ్ అయితే తాము ఈడీ ఆఫీసులో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురవుతుందని అన్నారు. తమది ఏ-టీమ్ అని, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన టీమ్ అని ఆమె తెలిపారు.

ఏచూరితో భేటి

మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం నేరుగా జంతర్ మంతర్ దీక్షాస్థలిని పరిశీలించిన కవిత, సాయంత్రం గం. 6.00 సమయంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. శుక్రవారం నాటి దీక్షకు మద్ధతు ప్రకటించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసి ఆహ్వానించినట్టు చెప్పారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1996 లో అప్పటి ప్రధాని దేవగౌడ మహిళ రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రయత్నించారని, అనంతరం ప్రతి ప్రధాన మంత్రి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారని కవిత గుర్తుచేశారు. కేవలం నేటి ప్రధాని మోదీ మాత్రమే మహిళ రిజర్వేషన్ల బిల్లు తెచ్చే ప్రయత్నమేదీ చేయలేదని, కనీసం దాని గురించి ఆలోచించలేదని అన్నారు. బిల్లు పెట్టడానికి వారి ముందు ఇక రెండు పార్లమెంటు సమావేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మహిళ రిజర్వేషన్ల బిల్లు తేవడం ఒక చారిత్రాత్మక సమయమని ప్రధానికి గుర్తు చేస్తున్నానని అన్నారు. 131 ఆర్థిక బిల్లులను పాస్ చేసిన మోడీ సర్కారు, జీఎస్టీ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లు సహా అనేక బిల్లులను కొన్ని గంటల వ్యవధిలో పెద్దగా చర్చ లేకుండానే పాస్ చేసిందని ఆమె అన్నారు. మహిళా బిల్లుపై ఏవైనా అభ్యంతరాలుంటే డ్రాఫ్ట్ బిల్లు తెచ్చి ముందు చర్చ మొదలుపెట్టాలని, చర్చతో పరిష్కారం కానిదంటూ ఏదీ ఉండదని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదని అన్నారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంతో ఉపయోగకరమని కూడా వ్యాఖ్యానించారు. బిల్లు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీని కోరుతున్నట్టు ఆమె వెల్లడించారు.

కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నాడు బిల్లును వ్యతిరేకించిన సమాజ్‌వాదీ తదితర పార్టీలు నేడు పునరాలోచన చేస్తున్నాయని, బిల్లులో పొందుపర్చిన కొన్ని అంశాలపై చర్చ జరగాలని, మహిళా రిజర్వేషన్లలో సామాజిక రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతున్నాయని చెప్పారు. అలాగే మజ్లీస్ పార్టీకి కూడా ఆహ్వానం పంపించామని, వారి ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఈడీ సమన్ల నుంచి తప్పించుకోడానికి మహిళా బిల్లు కోసం దీక్ష అంటున్నారని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. తాను దీక్ష చేస్తానంటూ మార్చి 2న ప్రకటన చేశానని, ఈడీ నుంచి సమన్లు మార్చి 7వ తేదీన అర్ధరాత్రి అందాయని తెలిపారు. ఇంకా చెప్పాలనుకుంటే దీక్షను దెబ్బతీయాలని చూసింది బీజేపీయేనని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement