Tuesday, January 14, 2025

TG | కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ దుర్మార్గమైన చర్య : కేటీఆర్

  • కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నిస్తే అణచివేత చర్యలా..
  • కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను కేటీఆర్ ఖండించారు. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని.. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

‘‘హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు.

- Advertisement -

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా ? పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థయిర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని” కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement