న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జులై 25తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అంతకంటే ముందు నుంచే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సన్నాహాలు ప్రారంభించింది. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించితే పోటీ రసవత్తరంగా మారనున్న నేపథ్యంలో తగినంత సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్న అంశంపై కూడా మేధోమథనం మొదలుపెట్టింది. ప్రతిసారీ ఊహలకు, అంచనాలకు అందకుండా అభ్యర్థులను రంగంలోకి దించుతున్న మోదీ-షా ద్వయం ఈసారి ఎవరిని తెరపైకి తీసుకొస్తుందోనన్న ఉత్కంఠ ఇతర పార్టీలతో పాటు సొంత పార్టీ బీజేపీలోనే నెలకొంది. 2017లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని దళితులకు దగ్గరయ్యేందుకు రామ్‌నాథ్ కోవింద్‌ను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చి బరిలోకి దింపిన కమల దళపతులు, ఈసారి ఏ సమీకరణాలను లెక్కిస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
మహిళకా.. గిరిజనులకా.. లేక గిరిజన మహిళకా?
గత రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టిన కమలనాథులు, ఈసారి రాష్ట్రపతిగా గిరిజనులకు లేదా మహిళలకు అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. లేదంటే గిరిజన మహిళకు అవకాశమిచ్చి ఏకకాలంలో రెండు రకాల సమీకరణాలకు పెద్దపీట వేసినట్టవుతుంది. ఈ క్రమంలో మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జ్యుయల్ ఓరంలలో ఎవరో ఒకరికి అవకాశమిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, దళిత సమీకరణాలతో రామ్‌నాథ్ కోవింద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. గిరిజనులకు అవకాశమివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తే ద్రౌపది ముర్ము పేరు ముందువరుసలో ఉంటుందని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటి వరకు గిరిజనులకు రాష్ట్రపతి పదవి దక్కలేదు. వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో బీజేపీని విస్తరించేందుకు గిరిజన అస్త్రం ఉపయోగపడుతుందన్న అంచనాల్లో కాషాయదళం ఉంది. తొలిసారిగా గిరిజనులను రాజ్యాంగపదవుల్లో అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ఘనతను సొంతం చేసుకోవచ్చు. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు బీజేపీ చేజారిన విషయం కూడా గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని గిరిజనులకు దగ్గరవ్వాలంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అస్త్రం పనికొస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ముస్లిం మైనారిటీకి అవకాశమిచ్చేనా?
బీజేపీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను పోగొట్టుకోవడం కోసం మైనారిటీ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. నిజానికి ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు చాలావరకు లేనప్పటికీ, అంతర్జాతీయ సమాజంలో ఎదుర్కొంటున్న అపప్రదను ఆ పార్టీ తీవ్రంగానే పరిణగిస్తోందని తెలుస్తోంది. దీనికితోడు ఇన్నాళ్లుగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేశాయి. ఇస్లామిక్ దేశాల నుంచి వెల్లువెత్తుతున్న నిరసన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేసి దిద్దుబాటు మొదలుపెట్టినప్పటికీ, అవి సరిపోవని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో మైనారిటీ సమీకరణాలకు ఈసారి పెద్దపీట వేస్తూ ముస్లింలకు మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీయే అభ్యర్థిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాంకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ ముస్లిం-మైనారిటీ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రేసులో ముందు వరుసలో కనిపిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. 15 రాష్ట్రాల్లో 20 మందికి పైగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్ తదితరులకు కొనసాగింపునిచ్చినా నఖ్వీ విషయంలో ఎటూ తేల్చలేదు. మరోవైపు రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లోనైనా నఖ్వీని బరిలోకి దింపవచ్చన్న ప్రచారం జరిగింది. చివరకు అక్కడా ఆయన పేరు కనిపించకపోవడంతో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ముస్లిం-మైనారిటీ కోటాలో నఖ్వీతో పాటు ఇంకెవరికైనా రేసులో ఉన్న మరో నేత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
దక్షిణంపై గురి!!
గిరిజన, మహిళ, ముస్లిం-మైనారిటీ సమీకరణాలతో పాటు దక్షిణ భారతదేశంపై కూడా గురిపెట్టినట్టు తెలుస్తోంది. దక్షిణాదిన కర్నాటకలో మినహా బీజేపీ మరెక్కడా అధికారంలో లేదు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేదు. 2024 ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, ఇంతకాలం పట్టులేని రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకుని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో దక్షిణాది నుంచి రాష్ట్రపతికి అవకాశం కల్పించి, దక్షిణాదివారి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటివరకు సర్వేపల్లి రాధాకృష్ణ, వివి గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్.వెంకట్రామన్ రాష్ట్రపతులుగా పనిచేశారు. ఈసారి దక్షిణాదికి అవకాశం కల్పించాలి అనుకుంటే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం. వెంకయ్య నాయుడుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా వెంకయ్య నాయుడు అభ్యర్థిగా ఉంటే బీజేపీయేతర రాజకీయ పార్టీల నుంచి కూడా మద్ధతు దొరకవచ్చని అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ దక్షిణాదితో పాటు మహిళా సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశం ఉంటుంది. ఓబీసీ సామాజికవర్గానికి చెందిన తమిళిసై విషయంలో మూడు అంశాలు (దక్షిణాది, మహిళ, ఓబీసీ) కలిసొస్తాయన్న లెక్కలు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది.
కుల సమీకరణాలతో బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న అగ్రవర్ణాలు దూరమయ్యే ప్రమాదముందని భావిస్తే.. ఆ కేటగిరీలో లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఊహకు అందకుండా, అంచనాలకు చిక్కకుండా వ్యవహరించే మోదీ-షా ద్వయం ఈసారి ఎవరిని ఎంపికచేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.