న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, మహారాష్ట్ర తరహాలో వారంతా తిరుగుబాటు చేస్తారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. కే. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సౌత్ అవెన్యూలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో సభాపతి ఎం. వెంకయ్య నాయుడు నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఈ మధ్యనే రాజ్యసభకు ఎన్నికైన డా. లక్ష్మణ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన్ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ నేతలు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, పెద్దల సభలో తెలంగాణ వాదన వినిపించేందుకు పార్టీ నాయకత్వం తనను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారని చెప్పారు. తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, నిబద్ధతకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానని వెల్లడించారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న తనకు దక్కిన ఈ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపుగా లక్ష్మణ్ అభివర్ణించారు. బీజేపీ అగ్రనాయకత్వం వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ అనేక పదవులు, బాధ్యతలు అప్పగిస్తోందని అన్నారు. దక్షిణాదికి పెద్దపీట వేస్తూ రాష్ట్రపతి కోటాలో నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్మణ్ గుర్తుచేశారు.
తెలంగాణ వ్యవహారాల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దోచుకున్నది చాలదన్నట్టు సీఎం కే. చంద్రశేఖర రావు ఇప్పుడు జాతీయస్థాయిలో దోచుకోవాలనుకున్నారని, కానీ అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఓవైపు పదే పదే ఎన్నికలతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే, దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర శివసేన తరహాలో టీఆర్ఎస్‌లో కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, సమయం చూసుకుని రెబెల్ నేతలు తిరుగుబాటు చేస్తారని డా. లక్ష్మణ్ అన్నారు. అయితే ఈ కట్టప్పల విషయంలో బీజేపీ ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుందని చెప్పారు. మహారాష్ట్రలోనూ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ కాదని ఆయన సూత్రీకరించారు. తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోందని డా. లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.