స్థానిక కాశ్మీరీ పండిట్ మహిళ, దులారీ భట్ (80) బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అనంత్‌నాగ్‌లోని మట్టన్ ప్రాంతానికి వెళ్లింది. అయితే అనారోగ్యానికి గురైన ఆ వృద్ధురాలు అక్కడ తుది శ్వాస విడిచింది. ఈ పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలకు స్థానిక ముస్లిం సోదరులు సహకరించి మత సామరస్యంతోపాటు సోదర భావాన్ని చాటారు. కుల్గాం జిల్లాలోని వైకే పోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆమె మృతదేహాన్ని సొంత గ్రామమైన వైకే పోరాకు తీసుకువచ్చారు. పాడె ఏర్పాటు నుంచి కట్టెల వరకు అన్నింటిని సమకూర్చారు. కొందరు ముస్లిం యువకులు ఆమె పాడె మోశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ వృద్ధురాలి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.
మరణించిన దులారీ భట్‌తో తమ అనుబంధాన్ని స్థానిక ముస్లింలు గుర్తు చేసుకున్నారు. తమ పండుగలు, వేడుకలతోపాటు విషాదాలప్పుడు కూడా ఆమె తమ ఇంటికి వచ్చేదని తెలిపారు. తమ గ్రామంలోని మిశ్రమ సంస్కృతిలో భాగమైన ఆమె అంత్యక్రియలను వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించడంలో సహకరించడం తమ కర్తవ్యమని అన్నారు. కష్ట సమయంలో తమ కుటుంబం వెన్నంటే ఉండి సహకరించిన స్థానిక ముస్లింలకు దులారీ భట్ కుమారుడు సుభాష్ కుమార్ భట్ కృతజ్ఞతలు తెలిపాడు. 1990లో తన తండ్రి జానకి నాథ్‌ను చంపారని, అయినప్పటికీ తాము కశ్మీర్‌ను వీడి పోలేదని చెప్పాడు. స్థానిక ముస్లింలతో కలిసి ఇన్నేళ్లుగా అక్కడే నివసించినట్లు ఆ కశ్మీరీ పండిట్ వెల్లడించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..