•కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసమే..
•కమిటీ వేసి నిరూపించాలి..
•బాధ్యులు ఎవరో తెలుస్తుంది..
కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నది. ఈ సినిమానుద్దేశించి జమ్మూ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో కశ్మీరీ పండిట్లను అప్పట్లో జమ్మూ కశ్మీర్ సీఎంగా ఉన్న తాను తరిమేసినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఆయనపై వస్తున్న విమర్శలపై మంగళవారం స్పందించారు. కశ్మీరీ పండిట్ల తరిమివేతకు తాను కారణమని నిరూపిస్తే.. దేశంలో ఎక్కడైనా ఉరేసుకునేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైన తరువాత కశ్మీరీ పండిట్ వలసలు రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. పండిట్ల తరిమివేత విషయంలో నిజాయితీగల న్యాయమూర్తిని లేదా కమిటీని ఏర్పాటు చేస్తేనే నిజం బయటపడుతుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఎవరు బాధ్యులనే విషయం మీకే తెలుస్తుందన్నారు. సిక్కులు, ముస్లింల త్యాగాలను విస్మరించారని, ఓ వర్గానికి మాత్రమే అన్యాయం జరిగినట్టు చూపించారని చెప్పుకొచ్చారు.
నిందించడం తగదు..
ఫరూక్ అబ్దుల్లా బాధ్యుడు అయితే.. దేశంలో ఎక్కడైనా ఉరి తీయడానికి అవకాశం ఇస్తానని చెప్పుకొచ్చారు. దీనికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. విచారణ చేయకుండా ఆరోపణలకు బాధ్యతలేని వ్యక్తులను నిందించొద్దని కోరారు. కశ్మీరీ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడనని అనుకోవడం లేదన్నారు. ప్రజలకు చేదు నిజం తెలియాలంటే అప్పటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో లేదా అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాట్లాడాలన్నారు. ఇప్పటికీ కశ్మీరీ పండిట్ల కోసం తన గుండె రక్తం చిందిస్తుందన్నారు. కొందరు కావాలనే.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేక్ అగ్నిహోత్రి చిత్రీకరించిన కశ్మీర్ ఫైల్స్‌లో ఎలాంటి నిజాల్లేవన్నారు. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన చిత్రమే అని కొట్టిపారేశారు. ఇది రాష్ట్రంలోని ప్రతీ హిందువు, ముస్లింను ప్రభావితం చేసే విషాదాన్ని రేకెత్తిస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..