Friday, November 22, 2024

Delhi | క‌ర్నాట‌క‌ గెలుపు బలుపు కాదు, వాపే.. వాళ్లంతా ఒక తాను ముక్కలే: కే. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు బలుపు కాదని, కేవలం వాపేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, లోక్‌సభ ఎన్నికలు బీజేపీకే పూర్తి అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షుల సమావేశం అనంతరం విమానాశ్రయానికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీ నేతలను గెలిపిస్తే చివరకు వెళ్లి చేరేది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోనే అని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

బీజేపీలో గెలిచినవారు బీఆర్ఎస్‌లో చేరిన దాఖలాలే లేవని, ప్రజలు మొత్తం గమనిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక తాను ముక్కలే అని ఆరోపించారు. బీజేపీని అడ్డుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా ధీటుగా ఎదుర్కొంటామని అన్నారు. తమ పార్టీ కార్యక్రమాల గురించి వివరిస్తూ బీజేపీ చేపట్టిన ‘జన్ సంపర్క్ అభియాన్’కు విశేష స్పందన లభించిందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా బీసీ గర్జనలు, సామాజిక సమ్మేళనాలు పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చేవారం ఢిల్లీలో మరోసారి మోర్చాల అధ్యక్షుల సమావేశం ఉంటుందని, అందులో విస్తృతస్థాయిలో కార్యాచరణపై చర్చిస్తామని అన్నారు. మరోవైపు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు వెళ్తామని డా. లక్ష్మణ్ చెప్పారు.

- Advertisement -

మరోవైపు ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) గురించి మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది తమ పార్టీ విధానపరమైన నిర్ణయమని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్ రద్దు, రామ మందిర నిర్మాణం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న బీజేపీతోనే ఉమ్మడి పౌర స్మృతి, దేశాభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్థాగత అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో రోడ్‌మ్యాప్ తయారు చేసి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని అన్నారు.

నాయకత్వ మార్పుపై చర్చ లేదు

తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో మార్పు గురించి శనివారం నాటి సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని డా. లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర మంత్రులకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారన్న అంశంపై పార్టీలో చర్చ లేదని చెప్పారు. పార్టీ ఎదిగే క్రమంలో భిన్నాభిప్రాయాలు సహజమేనని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అందరినీ కలుపుని వెళ్తామని అన్నారు. వార్తలు వేరు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పార్టీ మారతారనేది కేవలం వార్తలు మాత్రమేనని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. దక్షణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఈ నెల 8న హైదరాబాద్‌లో జరగాల్సిన దక్షిణాది రాష్ట్రాల నాయకుల సమావేశం వాయిదా పడిందని చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో తదుపరి తేదీ ఎప్పుడన్నది పార్టీ నాయకత్వం ప్రకటిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వ్యూహానికి సంబంధించి జులై 9న తెలంగాణలో సమావేశం జరుగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement