హైదరాబాద్ : కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే హైదరాబాద్ లోని అన్ని ఐటి కంపెనీలను కర్నాటకు తరలించేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లేఖ రాయడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన భాగ్యనగరంపై భారీ కుట్ర కథనాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్ కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. అంతేకాదు తెలంగాణలో వచ్చేది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు కర్ణాటకకు తరలించుకుపోతారని విమర్శించారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు.
ఇక ఇక్కడ
ఫాక్స్‌కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తోంది. చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. మనం కష్టపడి నాలుగేండ్లు వెంబడి పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నాం. వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్‌లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి ఫ్యాక్టరీ పెడుతాం అని ప్రకటించారు. ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకొలాన్‌లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంతస్తులు పూర్తయ్యాయి. వచ్చే ఏప్రిల్, మే నెలలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుంది అని కేటీఆర్ తెలిపారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబర్ 25న లేఖ రాశారు. ఆపిల్ ఎయిర్ పొడ్స్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చండి. తొందరల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. హైదరాబాద్ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తాం. ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది అని డీకే శివకుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు.
ఇక కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతది అనే దానికి ఇది ఒక చిన్న ఉదహరణ చెబుతూ, ఢిల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే, కొట్లాడే మొనగాడు, తెలంగాణ ప్రజయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే పరిస్థితి ఇలానే తయారవుతుంది. కాంగ్రెస్‌కు బెంగళూరు అడ్డా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో కాకుండా, బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. పైసలన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయి. సిద్ధారమయ్య, డీకే శివకుమార్ లు సంపాదించిన పైసలు తెలంగాణకు తరలుతున్నాయి. అడ్డంగా దొరికిపోతున్నాయి. అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ పరిశ్రమను బంద్ చేసి బెంగళూరుకు తరలిస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఒక్కోకంపెనీని భారీ ఆశలు చూపి బెంగుళూరుకు పట్టుకుపోతారన్నారు కెటిఆర్
ఇక కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని, కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఉందన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. 2014కు ముందు తాగు, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు దొరికారు కానీ, ఓటర్లు దొరకడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి పోటీ చేయరు కానీ ముఖ్యమంత్రి పదవి కావాలని చెబుతారని, చాలామంది ఆ పదవి కోసం చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లో సొంత నిర్ణయాలు తీసుకునేవారు లేరన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి కనిపిస్తోందన్నారు